పాపన్నపేట చేనేత సహకార సంఘం ప్రథమ సర్వసభ్య సమావేశం
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: చైర్మన్ కొడపాక విట్టల్
తెలుగు ట్రెండ్స్, పాపన్నపేట, సెప్టెంబర్ 29: మండల కేంద్రమైన పాపన్నపేట చేనేత సహకార సంఘం ప్రథమ సర్వసభ్య సమావేశం మంగళవారం సంఘం భవనంలో చైర్మన్ కొడపాక విట్టల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో చేనేత కార్మికుల సంక్షేమం, సంఘం అభివృద్ధి, సభ్యుల సమస్యలు, భవనానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా సంఘంలో కొత్తగా చేనేత సభ్యత్వాలను నమోదు చేయాలని సభ్యులు కోరారు. చేనేత వృత్తిని కొనసాగిస్తున్న వారికి గుర్తింపు కార్డులు అందించడంతో పాటు, కొత్తగా సభ్యత్వం పొందిన వారికి చేనేత హస్తకళలకు సంబంధించిన వృత్తి శిక్షణ కేంద్రాల ద్వారా తగిన శిక్షణ కల్పించాలని సమావేశంలో తీర్మానించారు.
50 సంవత్సరాలు నిండిన చేనేత సభ్యుల వివరాలను సేకరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ చేనేత పింఛన్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేయాలని సూచించారు.
చేనేత భవనానికి మరమ్మతులు చేయాలి
చేనేత సహకార సంఘం భవనం వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నందున తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సభ్యులు కోరారు. భవనం పాతదై వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో అవసరమైతే పాత భవనాన్ని తొలగించి, నూతన భవనాన్ని నిర్మించి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
అలాగే చేనేత భవన ప్రాంగణంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, నీటి కొరతను తీర్చేందుకు నూతన బోర్ వేయించాలని సభ్యులు కోరారు.
అద్దె బకాయిలు చెల్లించాలి
చేనేత భవనంలో ప్రస్తుతం అద్దెకు కొనసాగుతున్న ఐజల్ వాటర్ ప్లాంట్, పోస్ట్ ఆఫీస్, బట్టల దుకాణానికి సంబంధించిన అద్దె బకాయిలను చెల్లించాలని సభ్యులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు అద్దె బకాయిలు చెల్లించని పక్షంలో సంబంధిత సంస్థలు, దుకాణాలను ఖాళీ చేయించేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో కోరారు.
విద్యార్థులకు ఆర్థిక సహాయం
చేనేత వృత్తిలో వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ్యులు పేర్కొన్నారు. అలాంటి కుటుంబాల విద్యార్థులకు పై చదువుల కోసం ఆర్థిక సహాయం అందేలా కృషి చేయాలని కోరారు.
అదేవిధంగా చేనేత వృత్తిలో కొనసాగుతున్న పద్మశాలి కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు, వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
మృతులకు నివాళులు
సమావేశం ప్రారంభానికి ముందు సంఘం డైరెక్టర్లుగా పనిచేసి ఇటీవల మృతి చెందిన బీకొండ నారాయణ, బద్దాపురం రాములు, అలాగే పద్మశాలి కుల సంఘం నాయకుడు మరెల్లి రాములు కుటుంబాలకు సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పల్లె సంగమేశ్వర, పల్లె లక్ష్మణ్, దాసరి యాదయ్య, అచుకట్ల గురునాధం, జూకంటి సంగయ్య, సభ్యులు కల్లేటి సంగమేశ్వర, వళ్ళందేశీ శ్రీనివాస్, బద్దాపురం సంగమేశ్వర, పడిగే కిష్టయ్య, పోల శ్రీనివాస్, కొడపాక రాజేశ్వర్, పల్లె రామచందర్, వళ్ళందేశీ బుచ్చికుమార్, బీకొండ జోగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
