తూప్రాన్‌లో ఆక్రమణదారులపై ఉక్కుపాదం
మున్సిపాలిటీ–పోలీసుల సంయుక్త మెరుపు దాడులు.. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు
తూప్రాన్, సెప్టెంబర్ 12 (తెలుగు ట్రెండ్స్):
తూప్రాన్ మున్సిపల్ పరిధిలో అక్రమ ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు మున్సిపల్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. జాతీయ రహదారి, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ చర్యలతో అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాల నిర్వాహకుల్లో కలకలం రేగింది.
తూప్రాన్ ఎస్ఐ గంగరాజు, మున్సిపల్ కమిషనర్ కె. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్, మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని పలు ప్రాంతాల్లో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. రహదారులపై, ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన అక్రమ దుకాణాలు, ఆక్రమణలను గుర్తించి అక్కడికక్కడే తొలగించారు. వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు కలగకుండా రహదారులను, ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, ఎస్ఐ గంగరాజు మాట్లాడుతూ.. ఫుట్‌పాత్‌లు పాదచారుల కోసం మాత్రమేనని, వాటిని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. జాతీయ రహదారిపై అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫుట్‌పాత్ వ్యాపారుల నుంచి అద్దెలు వసూలు చేస్తున్న వారిపై నిఘా
ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న చిన్న వ్యాపారుల నుంచి కొందరు షట్టర్లు, దుకాణాల యజమానులు అక్రమంగా అద్దెలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కమిషనర్ తెలిపారు. ఇలాంటి వ్యవహారాలపై కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి, సంబంధిత యజమానుల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. అక్రమంగా అద్దెలు వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ అయితే వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించి ప్రజలకు, వాహనదారులకు స్వేచ్ఛాయుత రాకపోకలు కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే తొలగించిన ఆక్రమణలను తిరిగి ఏర్పాటు చేస్తే భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టణ ప్రజలు, వ్యాపారులు మున్సిపాలిటీ, పోలీసు శాఖకు సహకరించి రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించకుండా బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు కోరారు.

