తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
శివంపేటలో కేసీఆర్, తాతా మధు దిష్టిబొమ్మల దహనం
శివంపేట, సెప్టెంబర్ 12 (తెలుగు ట్రెండ్స్):
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.
శనివారం శివంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, అలాంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపై బాధ్యతారహితంగా, అనుచితంగా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పదవులకు, రాజ్యాంగ వ్యవస్థలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని పేర్కొన్నారు.
ప్రతిపక్ష నాయకులు తమ అభిప్రాయాలను, విమర్శలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తం చేయాలని, వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదని అన్నారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవడంతో పాటు తాతా మధుపై పార్టీ పరంగా, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులు కేసీఆర్, తాతా మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నవీన్ గుప్తా, సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
