Type Here to Get Search Results !

ప్రపంచంలోనే అరుదైన పథకం సీఎం బ్రేక్‌ఫాస్ట్.. మెదక్‌లో కేంద్రీకృత కిచెన్ ప్రారంభం

 





ప్రపంచంలోనే అరుదైన పథకం సీఎం బ్రేక్‌ఫాస్ట్.. మంత్రి వివేక్ వెంకటస్వామి

మెదక్, సెప్టెంబర్ 26 (తెలుగు ట్రెండ్స్): విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రపంచంలోనే అరుదైన పథకమని ఉపాధి, కార్మిక, గనుల శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

శనివారం మెదక్ పట్టణంలోని మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన కేంద్రీకృత కిచెన్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం కిచెన్‌లోని యంత్రాలను పరిశీలించి వాటి సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు.

తర్వాత మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. విద్యార్థులతో కలిసి మంత్రి అల్పాహారం తీసుకుని, ఆహారం ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికరమైన అల్పాహారం అందించడమే పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమం అమలులో సహకరిస్తున్న హరే కృష్ణ మూవ్‌మెంట్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

పాఠశాలలకు ఉదయం 8.30 గంటలకు అల్పాహారం చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రీకృత కిచెన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం వల్ల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇప్పటికే 10 వేల మంది టీచర్లను భర్తీ చేశామని, మెదక్‌లో యంగ్ ఇండియా స్కూల్‌ను వచ్చే సంవత్సరం నుంచి 2,500 మంది విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. మెదక్‌కు రూ.100 కోట్లతో పబ్లిక్ స్కూల్ కూడా వస్తోందన్నారు.

తెలంగాణలో 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహార పథకాన్ని అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. టెక్నాలజీ రంగంలో శిక్షణ కోసం నూతనంగా ఏటీసీ సెంటర్ ప్రారంభించామని, శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు మాట్లాడుతూ సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించడంతో పాటు విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మెదక్‌లో యంగ్ ఇండియా స్కూల్‌ను ప్రారంభించి విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ (హెచ్‌కెఎంసిఎఫ్) అధ్యక్షుడు, అక్షయపాత్ర ఫౌండేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధ్యక్షుడు హిస్ గ్రేస్ శ్రీ సత్య గౌర చంద్ర దాస మాట్లాడుతూ జిల్లాలో 30 వేల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.

కేంద్రీకృత కిచెన్‌ను తొలుత కొడంగల్‌లో ప్రారంభించామని, అక్కడి విధానాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నామని తెలిపారు. కొడంగల్ పరిసర పాఠశాలల్లో ఈ పథకం ద్వారా అదనంగా 20 శాతం మంది విద్యార్థులు చేరుతున్నారని పేర్కొన్నారు. మెదక్‌లో కిచెన్ షెడ్‌ను 40 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, హెచ్‌కెఎంసిఎఫ్ సీఈఓ శ్రీ కౌంతేయదాస ప్రభుజీ, పీఆర్ ఇన్‌చార్జి శ్రీ రవిలోచన దాస ప్రభుజీ, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language