వెల్దుర్తి పీహెచ్సీలో డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.. త్వరలో ఖాళీ పోస్టుల భర్తీ: డీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్
వెల్దుర్తి మండలం, సెప్టెంబర్ 20 (సాక్ష్యం):
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ సూచించారు. శనివారం వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అనిల్ కుమార్తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన డీఎంహెచ్వో.. వైద్య సేవలు, రోగులకు అందుతున్న చికిత్స, మందుల లభ్యత తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్సీలోని రికార్డులను పరిశీలించారు.
త్వరలో ఖాళీ పోస్టుల భర్తీ
వెల్దుర్తి పీహెచ్సీలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని, నియామక ప్రక్రియ పూర్తయిన వెంటనే వెల్దుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.
వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పీహెచ్సీకి వచ్చే ప్రతి రోగికి అవసరమైన వైద్యం అందేలా సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
మాసాయిపేటలో పీహెచ్సీ ఏర్పాటుకు ప్రతిపాదనలు
మాసాయిపేట మండల కేంద్రంలో జనాభా ప్రాతిపదికన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు డీఎంహెచ్వో వెల్లడించారు. ఇందులో భాగంగా చేగుంట మండలం, వెల్దుర్తి పరిధిలోని కొన్ని గ్రామాలను కలిపి జనాభా ప్రాతిపదికన వైద్య ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు.
విషజ్వరాలపై ప్రత్యేక నిఘా
వర్షాకాలంలో విషజ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ జ్ఞానేశ్వర్ సూచించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మొబైల్ వైద్య పరీక్షలు నిర్వహించి 120 మందికి పరీక్షలు చేయగా, 10 మందిలో విషజ్వరాలు గుర్తించినట్లు తెలిపారు. వారికి పీహెచ్సీలో చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం వారు కోలుకుంటున్నారని చెప్పారు.
రోగులకు అవసరమైన మందులు పీహెచ్సీలో అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి మందుల కొరత లేదని స్పష్టం చేశారు. అక్టోబర్ వరకు సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి
దోమలు, అపరిశుభ్రత కారణంగా వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్వో సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని కోరారు. వండిన ఆహారాన్ని వేడిగానే తీసుకోవాలని, తాగునీటిని కాచి చల్లార్చుకుని తాగడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రజలు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వెల్దుర్తి వైద్యాధికారి డాక్టర్ శిరీషతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

