జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
మెదక్, సెప్టెంబర్ 14 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించిన అనంతరం ఎస్పీ తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాలను జిల్లా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు, అభివృద్ధి నెలకొనాలని కోరుకున్నారు.
మెదక్ జిల్లాలో ప్రజలు అన్ని పండుగలను పరస్పర సోదరభావం, ఐక్యత, సామరస్యంతో నిర్వహించుకోవడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలు శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా గణేష్ మండపాల నిర్వాహకులు, యువత పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు పాటిస్తూ భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.
నవరాత్రి ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎస్పీ సూచించారు. గణేష్ మండపాల వద్ద భక్తుల భద్రతకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ప్రజలు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉంటూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
వినాయక చవితి పండుగ ప్రజల్లో భక్తి, ఐక్యత, సోదరభావాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలందరికీ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు, పోలీస్ శాఖ సమన్వయంతో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సామరస్యపూర్వకంగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

