సర్వేకుంటలో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
రామాయంపేట, సెప్టెంబర్ 17 (తెలుగు ట్రేండ్స్):
రామాయంపేట పట్టణ సమీపంలోని ఎన్హెచ్-44 రహదారి పక్కన ఉన్న సర్వేకుంట వద్ద వినాయక నిమజ్జనానికి జరుగుతున్న ఏర్పాట్లను మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన సుమారు 75 భారీ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సర్వేకుంటను సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అధికారులు చేపడుతున్న చర్యలను ఆమె సమీక్షించారు.
తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్తో కలిసి ఆర్డీఓ రమాదేవి చెరువు పరిసరాలను పరిశీలించారు. తహసీల్దార్ రజనీకుమారి, మున్సిపల్ కమిషనర్, పట్టణ ఎస్ఐ బాలరాజుతో కలిసి నిమజ్జన ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిమజ్జన సమయంలో భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ రమాదేవి మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భారీ సంఖ్యలో విగ్రహాలు తరలివచ్చే అవకాశం ఉన్నందున రద్దీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
నిమజ్జన ప్రాంతంలో తగినంత లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు క్రేన్లు, బారికేడ్లు తదితర సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని తెలిపారు. చెరువు పరిసరాల్లో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భక్తులకు సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ రమాదేవి ఆదేశించారు.
