Type Here to Get Search Results !

ప్రైవేట్ టీచర్ల సంక్షేమానికి జాతీయ విధానం తీసుకురావాలి


 

ప్రైవేట్ టీచర్ల సంక్షేమానికి జాతీయ విధానం కావాలి

సుప్రీంకోర్టు నోటీసులు చారిత్రాత్మకం: టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బాలసాయి హరిప్రసాద్

వెల్దుర్తి, సెప్టెంబర్ 13 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంక్షేమానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక విధానం రూపొందించాలని తెలంగాణ ప్రైవేట్‌ టీచర్ల ఫోరమ్‌ (టీపీటీఎఫ్‌) మెదక్‌ జిల్లా అధ్యక్షుడు బాలసాయి హరిప్రసాద్‌ కోరారు. ప్రైవేట్‌ ఉపాధ్యాయుల సంక్షేమంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ)కి నోటీసులు జారీ చేయడాన్ని ఆయన స్వాగతించారు.

సెప్టెంబర్‌ 10న న్యూఢిల్లీలో జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం పీఐఎల్‌ను విచారణకు స్వీకరించడం కీలక పరిణామమని తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కనీస వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఉద్యోగ భద్రత, పెన్షన్‌ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రైవేట్‌ టీచర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలకు తగిన భద్రత, గౌరవం కల్పించాలని పేర్కొన్నారు. 2024–25 యుడైస్‌ఈ లెక్కల ప్రకారం మెదక్‌ జిల్లాలో సుమారు 109 ప్రైవేట్‌ పాఠశాలల్లో 2 వేల మందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు లక్షల మంది ప్రైవేట్‌ టీచర్లు ఉన్నారని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు చొరవ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే ప్రైవేట్‌ టీచర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని బాలసాయి హరిప్రసాద్‌ కోరారు. ఉపాధ్యాయులను చట్టబద్ధ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

విద్యా వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ప్రైవేట్‌ ఉపాధ్యాయుల జీవితాల్లో భద్రత, భరోసా కల్పించేందుకు ఇదే సరైన సమయమని, సుప్రీంకోర్టు నోటీసులను ఆ దిశగా తొలి అడుగుగా ప్రభుత్వం భావించి తక్షణమే సంక్షేమ చర్యలు చేపట్టాలని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బాలసాయి హరిప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language