పౌష్టికాహారమే ఆరోగ్యానికి శ్రీకారం!
తల్లి ఆరోగ్యం.. బిడ్డభవిష్యత్తుకు బలం!
గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన
*వెల్దుర్తిమండలం,సెప్టెంబర్ 23(తెలుగు ట్రేండ్స్):*
తల్లి ఆరోగ్యం.. బిడ్డ భవిష్యత్తుకు బలమైన పునాది. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహారంపై అవగాహన పెంచుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న పోషణ మహోత్సవంలో భాగంగా వెల్దుర్తి మండల పరిధిలోని షేరిల్లా గ్రామ అంగన్వాడి కేంద్రంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడి టీచర్లు దేవలత, లక్ష్మి ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ లావణ్య అధ్యక్షతన కార్యక్రమం కొనసాగింది.
ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యం, సమతుల్య ఆహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. పోషణ మహోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రకాల చిరుధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు.
గర్భం నుంచే శ్రద్ధ.. ఆరోగ్యకరమైన బిడ్డ
గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం వరకు గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం అత్యంత అవసరమని సిబ్బంది వివరించారు. తల్లికి సరైన పోషకాహారం అందితేనే శిశువు ఆరోగ్యకరంగా ఎదిగే అవకాశం ఉంటుందని తెలిపారు. పోషకాహార లోపం రాకుండా సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు.
గ్రామ సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న అదనపు ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాల
ని కోరారు. పాలు, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలతో కూడిన పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు.
ఆరోగ్య పరీక్షలు.. ఐరన్ మాత్రలు తప్పనిసరి
ఏఎన్ఎం అనిత మాట్లాడుతూ.. గర్భిణీలు సబ్సెంటర్లో అందిస్తున్న ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. నెలనెలా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు, వైద్యుల సూచన మేరకు ఇంజక్షన్లు, ఐరన్ మాత్రలను క్రమం తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.
పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్య పరీక్షలపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, ఆశా వర్కర్లు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

