కాళోజీ సేవలు చిరస్మరణీయం: అదనపు కలెక్టర్ నగేష్
తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ నారాయణరావుకు ఘన నివాళి
మెదక్, సెప్టెంబర్ 9 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచిన ప్రజాకవి, సామాజిక ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.
బుధవారం ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్ హాజరయ్యారు. డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, బీసీ సంక్షేమ అధికారి ఉపేందర్, ఎస్సీ సంక్షేమ అధికారి సింధుతో పాటు కలెక్టరేట్ కార్యాలయ సూపరింటెండెంట్లతో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు చేస్తూ ప్రజలను సామాజికంగా మేల్కొల్పిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. సమాజంలోని సమస్యలను తన రచనల ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చి, ప్రజల్లో చైతన్యం కల్పించడంలో కాళోజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు.
కాళోజీ నారాయణరావు చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ బిరుదుతో గౌరవించిందని అన్నారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతికి కాళోజీ చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
కాళోజీ జయంతిని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. కాళోజీ ఆశయాలు, రచనలు, ప్రజా చైతన్య స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
