భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు
పకడ్బందీ దర్యాప్తు.. బలమైన సాక్ష్యాలతో నిందితురాలికి శిక్ష
పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
మెదక్, మనోహరాబాద్ సెప్టెంబర్
21 (తెలుగు ట్రెండ్స్):
భర్తను రోకలిబండతో దాడి చేసి హత్య చేసిన కేసులో నిందితురాలికి జిల్లా ప్రధాన న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.6 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు. మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన ఈ హత్య కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేసి బలమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో సమర్పించడంతో నిందితురాలికి శిక్ష పడినట్లు పోలీసులు తెలిపారు.
ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. పార్కిబండ గ్రామానికి చెందిన మురళికి, మనోహరాబాద్కు చెందిన విజయలక్ష్మితో సుమారు 22 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా కుటుంబ విషయాలపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామ పెద్దల సమక్షంలో కూడా పంచాయతీలు నిర్వహించి ఇరువురికి నచ్చజెప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. మురళికి సుమారు 18 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. అప్పటి నుంచి పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉండటంతో ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరిగేవని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో 2021 మార్చి 15న రాత్రి మురళి మంచంపై నిద్రిస్తున్న సమయంలో విజయలక్ష్మి రోకలిబండతో అతనిపై దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తీవ్రంగా గాయపడిన మురళి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 2021 మార్చి 16న అప్పటి మనోహరాబాద్ ఎస్ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అప్పటి దర్యాప్తు అధికారి తూప్రాన్ సీఐ స్వామిగౌడ్ కేసులో పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం ప్రస్తుత దర్యాప్తు అధికారి వెంకట రాజాగౌడ్ సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి కేసు విచారణను ముందుకు తీసుకెళ్లారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు.
కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితురాలు విజయలక్ష్మికి జీవిత ఖైదుతో పాటు రూ.6 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
కేసు విచారణలో కోర్టు లైజన్ అధికారులు ఎస్ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ మహిపాల్ రెడ్డి సహకరించారు. నిందితురాలికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి, పటిష్ఠమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో సమర్పించిన దర్యాప్తు అధికారులు, కోర్టు లైజన్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.
