రాజీ మార్గమే రాజమార్గం.. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
ప్రజలకు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచన
మెదక్, సెప్టెంబర్ 9 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసుకుని కోర్టుల చుట్టూ తిరగకుండా, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ మంచి అవకాశమని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు. ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కోర్టుల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన కేసులను ఇరుపక్షాల పరస్పర అవగాహనతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ఇరువర్గాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.
క్రిమినల్ కంపౌండబుల్ కేసులతో పాటు సివిల్, ఆస్తి, కుటుంబ, వైవాహిక వివాదాలు, చెక్ బౌన్స్, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, సైబర్ సంబంధిత రాజీ పడదగిన కేసులను చట్టపరమైన నిబంధనల మేరకు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఎస్పీ వివరించారు.
వివాదాలను కక్షలుగా మార్చుకుని ఇరువర్గాలు సమయం, ధనాన్ని కోల్పోవద్దని డి.వి. శ్రీనివాసరావు సూచించారు. ‘రాజీ మార్గమే రాజమార్గం’ అనే విషయాన్ని గుర్తించి లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
రాజీ పడదగిన కేసులను గుర్తించి సంబంధిత పక్షాలకు అవగాహన, కౌన్సెలింగ్ కల్పిస్తూ కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది కృషి చేస్తారని తెలిపారు. తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలనుకునే వారు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.
