ఖరీఫ్ పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు
అక్టోబర్ 1 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలి: అదనపు కలెక్టర్ సంగీత
తెలుగు ట్రెండ్స్, అందోలు ప్రతినిధి: జిల్లాలో వానాకాలం 2026-27 సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంగీత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పత్తి కనీస మద్దతు ధర కొనుగోళ్లపై సంబంధిత శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.
రాష్ట్రంలో పత్తి సేకరణ ప్రారంభమైన వెంటనే అన్ని అధీకృత జిన్నింగ్ మిల్లులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దీనివల్ల రైతులు తమకు సమీపంలోని మిల్లులకు పత్తిని తరలించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
జిల్లాలో ఈ సీజన్లో 3,57,246 ఎకరాల్లో పత్తి సాగు కాగా, సుమారు 3,16,520 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందన్నారు. 2026-27 సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించినట్లు తెలిపారు. రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పత్తి సేకరణలో సీసీఐ కీలకంగా వ్యవహరించనుందని పేర్కొన్నారు.
ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాలకు కొనుగోలు అధికారులను కేటాయించి, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. అన్ని జిన్నింగ్ మిల్లుల్లో అవసరమైన సాఫ్ట్వేర్, వెబ్ కెమెరాలు, వేలిముద్ర స్కానర్లు, సక్రమమైన ఇంటర్నెట్ సౌకర్యం, అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లోని వేబ్రిడ్జ్లను లీగల్ మెట్రాలజీ శాఖ ద్వారా ధ్రువీకరించి తూకం ఖచ్చితత్వాన్ని నిర్ధారించాలని సూచించారు. నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చూడాలని తెలిపారు. తూనిక యంత్రాల్లో ఎలాంటి తేడాలు లేకుండా లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
రైతు దిగుబడి 40 క్వింటాళ్లలోపు ఉంటే ఏఈఓ, 40 క్వింటాళ్లకు మించి ఉంటే ఏఓ ధ్రువీకరణ పత్రం జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ 1 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతర్జిల్లా మ్యాపింగ్‌కు సంబంధించిన ప్రతిపాదనలు ఉంటే సెప్టెంబర్ 30లోగా ఖరారు చేసి సీసీఐకి పంపాలని తెలిపారు.
అంతర్జిల్లా మ్యాపింగ్ ద్వారా రైతుల రవాణా భారం తగ్గడంతో పాటు స్లాట్ల లభ్యత కూడా పెరుగుతుందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.
కాపాస్ కిసాన్ యాప్‌లో రైతుల నమోదు
జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. జిల్లాలో సదాశివపేట, రాయికోడ్, నారాయణఖేడ్, జోగిపేట, వట్పల్లి, జహీరాబాద్‌లలో ఆరు కాటన్ ఏఎంసీలు ఉన్నాయని తెలిపారు. గత సీజన్లో 24 జిన్నింగ్ మిల్లులు ఉండగా, ఈ సీజన్లో 23 జిన్నింగ్ మిల్లులను ప్రతిపాదించినట్లు వివరించారు.
పత్తి కొనుగోళ్లకు ముందే కాపాస్ కిసాన్ యాప్‌లో రైతుల నమోదు, స్లాట్ బుకింగ్, పత్తి నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతం, పత్తిని వదులుగా తీసుకురావడం తదితర అంశాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
మండలాల వారీగా పత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తి వివరాలతో పాటు రైతుల డేటాను సెప్టెంబర్ 30లోగా ఎన్ఐసీ ద్వారా కాపాస్ కిసాన్ యాప్‌కు బదిలీ చేయాలని తెలిపారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం ద్వారా కాపాస్ కిసాన్ యాప్‌లో నమోదు, స్లాట్ బుకింగ్, కొనుగోలు కేంద్రాల వివరాలను రైతులకు తెలియజేయాలని సూచించారు.
కౌలు రైతుల వివరాలను ఏఈఓలు, ఏఓలు క్రాప్ బుకింగ్ సైట్లో నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లు సజావుగా, పారదర్శకంగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సంగీత ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీకాంత్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు, సిబ్బంది పాల్గొన్నారు.



