రంగంపేటలో వేడెక్కిన బీఆర్‌ఎస్–కాంగ్రెస్ రాజకీయం
సవాళ్లు.. ప్రతి సవాళ్లతో హైటెన్షన్
పోలీసుల బందోబస్తు మధ్య రచ్చబండ
కొల్చారం, ఆగస్టు 29 (తెలుగు ట్రేండ్స్ న్యూస్ ):
మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. గత కొంతకాలంగా ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం శనివారం సవాళ్లు.. ప్రతి సవాళ్లకు దారితీసింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇటీవల మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్‌పై కొల్చారం మండలం మాజీ జెడ్పీటీసీ అరిగే రమేష్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై మండల కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఐదు రోజుల క్రితం పోతంశెట్టిపల్లిలోని హనుమమ్మ గార్డెన్‌లో మండల కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగిన అరిగే రమేష్‌కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. రాజకీయ పదవుల్లో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.
దీనికి ప్రతిస్పందనగా మూడు రోజుల క్రితం రంగంపేటలోని అరిగే రమేష్‌కుమార్ ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై వారు తీవ్రంగా స్పందించారు. తమ ఆరోపణలను, విమర్శలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ.. ఆగస్టు 29న రంగంపేటలో రచ్చబండ నిర్వహించేందుకు రావాలని కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు.
దీంతో శనివారం ఉదయం నుంచే రంగంపేటలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం 8 గంటల నుంచే కొల్చారం పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
రవీందర్ గౌడ్‌కు రమేష్‌కుమార్ సవాల్
రచ్చబండ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ అరిగే రమేష్‌కుమార్ కాంగ్రెస్ నాయకుడు కొమ్ముల రవీందర్ గౌడ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ అనుభవంపై ప్రశ్నలు సంధిస్తూ.. రాజకీయాల్లో తన స్థాయి, గత అనుభవాలను పరిశీలించుకోవాలని అన్నారు.
తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, అవసరమైతే విలేకరుల సమక్షంలో చర్చకు రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని రమేష్‌కుమార్ సవాల్ చేశారు. గతంలో తనతో ఉన్న పరిచయాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల స్పందన తెలియాల్సి ఉంది.
బండి రమేష్‌పైనా ఆరోపణలు
మాజీ సర్పంచ్ బండి సుజాత భర్త బండి రమేష్‌ను ఉద్దేశించి కూడా రమేష్‌కుమార్ పలు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన సర్పంచ్‌గా ఉన్న కాలంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. తనపై ఆరోపణలు చేసే ముందు గత విషయాలను గుర్తు చేసుకోవాలని అన్నారు.
తనపై చేసిన ఆరోపణలను నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తాను చెప్పిన విషయాలపై చర్చకు రావడానికి బండి రమేష్ సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. అవసరమైతే తాను మరోసారి విలేకరుల ముందుకు వచ్చి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుడి మృతి అంశం ప్రస్తావన
గతంలో బండి సుజాత సర్పంచ్‌గా ఉన్న సమయంలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందిన ఘటనను కూడా రమేష్‌కుమార్ ప్రస్తావించారు. అంబేద్కర్ విగ్రహం సమీపంలోని మురుగు కాలువలో పడి కార్మికుడు మృతి చెందిన సమయంలో తానే దగ్గరుండి పోస్టుమార్టం తదితర ఏర్పాట్లు చేయించడంతో పాటు రూ.10 వేల వరకు ఖర్చు చేశానని తెలిపారు.
ఈ విషయానికి సంబంధించి తనపై ఆరోపణలు చేయడం సరికాదని బండి రమేష్‌ను ఉద్దేశించి అన్నారు. అవసరమైతే అప్పటి ఘటనకు సంబంధించిన విషయాలను ప్రస్తుత ఉపసర్పంచ్ చిట్కుల సురేష్ కూడా వివరించగలరని పేర్కొన్నారు.
పోలీసుల జోక్యంతో తప్పిన ఉద్రిక్తత
ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో రంగంపేటలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటాయోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన కొల్చారం పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కొల్చారం ఎస్‌ఐ మహ్మద్ మొహీనుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసుల అప్రమత్తత, జోక్యంతో ఇరువర్గాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కార్యక్రమం కొనసాగింది.
రంగంపేటలో చోటుచేసుకున్న ఈ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్–కాంగ్రెస్ నాయకుల మధ్య కొనసాగుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్లు రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సి ఉంది.
– రిపోర్టర్ ముత్తయ్య


