మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన ఏడుపాయల వనదుర్గామాత
పాపన్నపేట, అక్టోబర్ 14 (తెలుగు ట్రెండ్స్):
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లాలోని ఏడుపాయల శ్రీ వనదుర్గాభవాని అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం అమ్మవారు మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా అమ్మవారిని ఆకుపచ్చ రంగు వస్త్రాలతో అత్యంత సుందరంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక మండపంలో అలంకరించిన అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాపన్నపేట ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సాయిబాబా, నరేష్, మహేష్, యాదగిరి, దీపక్ రెడ్డి, బలరాం తదితరులు పాల్గొన్నారు.

