పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
శివ్వంపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
తెలుగు ట్రెండ్స్, శివ్వంపేట, అక్టోబర్ 8: పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాణ్యమైన దర్యాప్తుతో కేసుల ఫైళ్లను త్వరితగతిన కోర్టుకు సమర్పించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన శివ్వంపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పరిపాలనా వ్యవహారాలు, రికార్డుల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఎస్పీ పరిశీలించారు. క్రైమ్ రికార్డులు, జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్ కాపీలు, కేసు డైరీలు, ముద్దాయిల రిమాండ్ ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
పెండింగ్ కేసులపై ఆరా
స్టేషన్లో పెండింగ్‌లో ఉన్న యూఐ కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లు, సీసీ నంబర్లు రాని కేసుల వివరాలను ఎస్సై మధుకర్‌రెడ్డిని ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు.
కేసులకు సంబంధించిన దర్యాప్తును పూర్తి చేసి, ఫైళ్లను ఆలస్యం చేయకుండా కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. దర్యాప్తులో నాణ్యతతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
మూడు కేసుల్లో జీవిత ఖైదు తీర్పులపై అభినందన
ఈ ఏడాది శివ్వంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మూడు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడేలా తీర్పులు రావడంలో కృషి చేసిన ఎస్సై మధుకర్‌రెడ్డి, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే విధమైన సమర్థవంతమైన దర్యాప్తును కొనసాగించాలని సూచించారు.
ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. వారి సమస్యలను ఓపికగా విని, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే శివ్వంపేటలోని ప్రధాన కూడళ్లు, గ్రామాల్లో పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.
గంజాయి, అక్రమ మద్యం, జూదంపై కఠిన చర్యలు
గంజాయి, అక్రమ మద్యం, జూదం తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా పెంచి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. నేరాల నియంత్రణతో పాటు నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంలో సీసీటీవీ ఫుటేజీ కీలకంగా ఉంటుందని ప్రజలకు వివరించాలని సూచించారు.
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురైన వారు ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆన్లైన్ బ్యాంకింగ్, ఓటీపీలు, లింకులు, ఫేక్ కాల్స్, డిజిటల్ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ వెంకటరాజు గౌడ్, ఎస్బీ సీఐ సందీప్‌రెడ్డి, ఎస్సై మధుకర్‌రెడ్డి, ఏఎస్ఐ
భారతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
