![]() |
“ప్రతీకాత్మక చిత్రం”
బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు.. చికిత్స పొందుతూ మృతి
చిన్నశంకరంపేట, అక్టోబర్ 21 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో బైక్ అదుపుతప్పి కిందపడిన వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సై శివానందం వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఎల్లారపు రాజు (48) కూలి మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కూలి పనులు ముగించుకొని కార్మికులను చందంపేట గ్రామంలో దించి వస్తానని చెప్పి వెళ్లాడు.
అయితే సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో రుద్రారం శివారులోని పెద్దమ్మ గుడి సమీపంలో రాజు బైక్‌పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
గాయపడిన రాజును మెరుగైన చికిత్స కోసం ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు.
మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై శివానందం తెలిపారు.
