ఆర్కేలా గ్రామంలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు
ఆటపాటలతో సందడి చేసిన మహిళలు.. చెరువుల్లో బతుకమ్మల నిమజ్జనం
తెలుగు ట్రెండ్స్, పాపన్నపేట, అక్టోబర్ 18:
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అర్కేల్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
గునుగు, తంగేడు, బంతి తదితర రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చిన మహిళలు వాటి చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. చిత్తు చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మా..” అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, పిల్లాపాపలను చల్లగా చూడాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద వృద్ధి చెంది ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని గౌరమ్మ తల్లిని మహిళలు ప్రార్థించారు. బతుకమ్మ పండుగ ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని, మహిళల ఐక్యతను చాటిచెబుతుందని ఈ వేడుకలు మరోసారి తెలియజేశాయి.
తొమ్మిది రోజుల పాటు కొనసాగిన బతుకమ్మ వేడుకలకు ముగింపుగా నిర్వహించే సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం “వెళ్లి.. మళ్లీ రావే గౌరమ్మ తల్లి” అంటూ బతుకమ్మలను స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేసి అమ్మవారికి వీడ్కోలు పలికారు.
గ్రామ మహిళలు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాలతో అర్కేల్ గ్రామంలో పండుగ సందడి నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్థులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

