ఏడుపాయల్లో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడు.. తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
క్యూఆర్‌టీ సిబ్బంది సమయస్ఫూర్తితో బాలుడికి రక్షణ
పాపన్నపేట, అక్టోబర్ 23 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి దర్శనానికి వచ్చి తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. విధుల్లో ఉన్న మెదక్ జిల్లా పోలీసుల క్యూఆర్‌టీ (QRT) సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి బాలుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే.. బాన్సువాడకు చెందిన మోహన్, సంధ్య దంపతులు శుక్రవారం ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో వారి నాలుగేళ్ల కుమారుడు మోక్షిత్ తప్పిపోయాడు. ఆలయ ప్రాంగణంలో బాలుడు ఒంటరిగా ఏడుస్తూ కనిపించడంతో అక్కడ విధుల్లో ఉన్న క్యూఆర్‌టీ సిబ్బంది వెంటనే స్పందించారు. బాలుడిని చేరదీసి, అతని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
అనంతరం బాలుడి తల్లిదండ్రులను గుర్తించి, వారిని సంప్రదించి చిన్నారిని సురక్షితంగా అప్పగించారు. తమ కుమారుడు క్షేమంగా తిరిగి దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల చొరవకు కృతజ్ఞతలు తెలిపారు.
చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
ఆలయాలు, జాతరలు, ఇతర రద్దీ ప్రదేశాలకు పిల్లలతో వచ్చే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. చిన్నారులను కంటికి రెప్పలా చూసుకోవాలని, జనసందోహంలో ఒంటరిగా వదిలిపెట్టవద్దని కోరారు.
సమయస్ఫూర్తితో స్పందించి బాలుడికి భద్రత కల్పించి తల్లిదండ్రుల వద్దకు చేర్చిన క్యూఆర్‌టీ సిబ్బందిని పోలీసులు అభినందించారు.
తెలుగు ట్రెండ్స్ న్యూస్ | telugutrendsnews.com
