టీబీ రహిత గ్రామంగా హస్తాల్పూర్.. జిల్లా స్థాయిలో అభినందనలు
వెల్దుర్తి మండలానికి ప్రత్యేక గుర్తింపు.. సర్పంచ్ నరసింహారెడ్డికి ప్రశంసాపత్రం
జిల్లా వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ చేతుల మీదుగా సత్కారం
*వెల్దుర్తిమండలం,అక్టోబర్ 08(తెలుగు ట్రేండ్స్
):*
టీబీ వ్యాధి నిర్మూలనలో భాగంగా మెదక్ జిల్లాలో 13 గ్రామాలను టీబీ రహిత గ్రామాలుగా ఎంపిక చేయగా, అందులో వెల్దుర్తి మండల పరిధిలోని హస్తాల్పూర్ గ్రామం చోటు దక్కించుకుంది. గ్రామంలో ఒక్క టీబీ పేషెంట్ కూడా లేకపోవడంతో అస్థాల్పూర్కు ఈ ప్రత్యేక గుర్తింపు లభించింది.
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో హస్తాల్పూర్ గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. టీబీ నియంత్రణలో గ్రామ ప్రజల సహకారం, ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పించడంలో గ్రామ పంచాయతీ చేపట్టిన చర్యలను అధికారులు అభినందించారు.టీబీ లక్షణాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు, అనుమానిత లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామంలో టీబీ కేసులు లేకుండా ఇదే పరిస్థితిని కొనసాగించేందుకు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, గ్రామస్థులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.మెదక్ జిల్లాలో ఎంపికైన 13 టీబీ రహిత గ్రామాల్లోహస్తాల్పూర్ గ్రామం చోటు దక్కించుకోవడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ఎంపీడీఓ విఘ్నేశ్వర్ పాల్గొన్నారు.

