రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు టేక్మాల్ మోడల్ స్కూల్ విద్యార్థిని లోకేశ్వరి ఎంపిక
పాపన్నపేట, అక్టోబర్ 14 (తెలుగు ట్రెండ్స్):
తెలంగాణ మోడల్ స్కూల్ టేక్మాల్కు చెందిన విద్యార్థిని లోకేశ్వరి ఖో ఖో క్రీడలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఇటీవల మెదక్ జిల్లా నర్సాపూర్లోని అల్లూరి సీతారామరాజు పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-18 ఖో ఖో పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గజేంద్రుల నర్సింలు తెలిపారు.
ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీల్లో లోకేశ్వరి పాల్గొననుంది. జిల్లా స్థాయి పోటీల్లో తన ప్రతిభతో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సుంకరి సాయిలు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో లోకేశ్వరి ప్రతిభ కనబరిచి విజయం సాధించడంతోపాటు భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎంపికై పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
క్రమశిక్షణ, పట్టుదలతో నిరంతరం సాధన చేస్తే క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో లోకేశ్వరి సత్తా చాటి మరిన్ని విజయాలు సాధించాలని పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకాంక్షించారు.
