పండుగ సెలవుల్లోనూ పౌష్టికాహారం పంపిణీకి చర్యలు
అంగన్వాడీ లబ్ధిదారులకు టీహెచ్ఆర్ తప్పనిసరి.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు
వెల్దుర్తి మండలం, అక్టోబర్ 11 (తెలుగు ట్రెండ్ న్యూస్):
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించినప్పటికీ లబ్ధిదారులకు పౌష్టికాహారం పంపిణీ తప్పనిసరిగా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్ 10 నుంచి 21వ తేదీ వరకు అంగన్వాడీ టీచర్లకు సెలవులు ఉండటంతో, ఈ సమయంలో సాధారణంగా కేంద్రాల్లో అందించే వేడి భోజనానికి బదులుగా టేక్ హోమ్ రేషన్ (టీహెచ్ఆర్) పంపిణీ చేస్తున్నారు.
ఈ మేరకు వెల్దుర్తి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలు, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు టేక్ హోమ్ రేషన్ అందిస్తున్నట్లు అంగన్వాడీ సూపర్వైజర్లు మాధవి, లక్ష్మి తెలిపారు.
గర్భిణులు, బాలింతలకు బియ్యం, పప్పు, నూనె, గుడ్లు, పాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. చిన్నారులకు బియ్యం, పప్పు, నూనె, గుడ్లతో పాటు మురుకులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. పండుగ సెలవుల కారణంగా అర్హులైన లబ్ధిదారులకు పౌష్టికాహారం అందకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పంపిణీ చేపట్టినట్లు తెలిపారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రేషన్ అందించాలని అధికారులు సూచించినట్లు సూపర్వైజర్లు తెలిపారు. పంపిణీలో నిర్లక్ష్యం వహించినా, లబ్ధిదారులకు సరుకులు అందించకపోయినా సంబంధిత అంగన్వాడీ సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
పండుగల సమయంలోనూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి అవసరమైన పౌష్టికాహారం అందేలా పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.

