మల్కాపూర్‌లో 423వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో గ్రామ వీధుల శుభ్రత
తెలుగు ట్రెండ్స్, తూప్రాన్:
తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 423వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఆదివారం 8వ వార్డులో నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, చీపుర్లతో సీసీ రోడ్లను శుభ్రపరిచారు.
బతుకమ్మ, దసరా పండుగలను దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని వీధులన్నీ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ తెలిపారు. పండుగల సందర్భంగా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంతో పాటు గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
గ్రామ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తగిన ప్రదేశాల్లో వేయాలని సూచించారు. గ్రామ పరిశుభ్రతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, పాలకవర్గ సభ్యులు జిన్న కృష్ణ, మన్నె తిరుపతి, రేఖ నాగరాజు గౌడ్, సరిత పరమేష్ గౌడ్, యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

