YPR ఫార్మసీ కళాశాలలో ఘనంగా వినాయక నిమజ్జనం
నర్సాపూర్, సెప్టెంబర్ 16 (తెలుగు ట్రేండ్స్):
నర్సాపూర్ పట్టణ సమీపంలోని వైపర్ ఫార్మసీ కళాశాలలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడిని బుధవారం విద్యార్థుల ఆటపాటలు, ఉత్సాహం నడుమ ఘనంగా నిమజ్జనం చేశారు.
వినాయక నిమజ్జన కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ, సందడి మధ్య నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పండుగలు విద్యార్థుల్లో ఐక్యత, స్నేహభావం, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు.
అనంతరం నిర్వహించిన లడ్డూ వేలం పాట ఆసక్తికరంగా సాగింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఒక లడ్డూను రూ.20,500కు దక్కించుకోగా, నాలుగో సంవత్సరం విద్యార్థి కార్తీక్ మరో లడ్డూను రూ.18,000కు దక్కించుకున్నారు. లడ్డూ వేలం పాటలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల హెచ్ఓడీలు డాక్టర్ రాజేంద్రప్రసాద్, కె. వనిత, అధ్యాపకులు సూర్యం, సాయి కృప రాజ్, సాంస్కృతిక కార్యక్రమాల ఇన్చార్జి రమ్యతో పాటు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
