వీధి కుక్కలకు యాంటీ రేబీస్ టీకాలు
రేబీస్ వ్యాప్తి నియంత్రణకు ముందస్తు చర్యలు
వెల్దుర్తి మండలం, సెప్టెంబర్ 17 (తెలుగు ట్రేండ్స్):
వీధి కుక్కల ద్వారా రేబీస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నెల్లూరు గ్రామంలో కుక్కలకు యాంటీ రేబీస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన బ్లూ క్లాస్ అసోసియేషన్ సభ్యులు గ్రామంలోని వీధి కుక్కలకు టీకాలు వేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రంగారెడ్డి మాట్లాడుతూ.. వీధి కుక్కల ద్వారా రేబీస్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కుక్కలకు టీకాలు వేయించడం ద్వారా రేబీస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కుక్కకాటుకు గురైనప్పుడు రేబీస్ ముప్పు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీధి కుక్కలను రెచ్చగొట్టకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని, ముఖ్యంగా చిన్నారులు కుక్కల దగ్గరకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అలాగే గ్రామ ప్రజలు తమ పెంపుడు కుక్కలకు కూడా తప్పనిసరిగా యాంటీ రేబీస్ టీకాలు వేయించాలని సర్పంచ్ సూచించారు. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం ద్వారా రేబీస్ వంటి వ్యాధుల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లూ క్లాస్ అసోసియేషన్ సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

