విద్యార్థుల సౌకర్యాలకు పెద్దపీట
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షూస్, సాక్స్, బ్యాగులు, బెల్టుల పంపిణీ
వెల్దుర్తి, సెప్టెంబర్ 18 (తెలుగు ట్రెండ్స్):
విద్యార్థుల సౌకర్యాలు, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చాటిచెప్పేలా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు. కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులందరికీ షూస్, సాక్స్, బ్యాగులు, బెల్టులు అందజేశారు.
విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం అభినందనీయమని కళాశాల వర్గాలు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బి. శ్రీనివాసులు మాట్లాడుతూ.. కళాశాలకు ఇప్పటివరకు హాజరు కాని విద్యార్థులు ఇక ఆలస్యం చేయకుండా శనివారం నుంచి కళాశాలకు హాజరై తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతూ చదువుపై దృష్టి సారించాలని, మంచి ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారికి అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కళాశాలలో మెరుగైన విద్యా వాతావరణం ఏర్పడుతుందని అధ్యాపకులు తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
