Type Here to Get Search Results !

శ్రీకృష్ణుని చరిత్ర ఆచరణీయం రంగంపేటలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు

 



శ్రీకృష్ణుని చరిత్ర ఆచరణీయం

రంగంపేట రంగనాయక స్వామి ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కొల్చారం, సెప్టెంబర్ 4 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
జగద్రక్షకుడైన శ్రీకృష్ణుని చరిత్ర ప్రతి ఒక్కరూ ఆచరించదగినదని శ్రీశఠకోప సిద్ధాంత పీఠం, శ్రీ విల్లిపుత్తూర్ మనవాళ మహాముని సన్నిధి 23వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శఠకోపముని రామానుజ జీయర్ స్వామి అన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, కన్నులపండువగా నిర్వహించారు.

మండలంలోని రంగంపేట గ్రామంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం మంజీరా నది నుంచి పవిత్ర జలాలను ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం పంచామృతాలు, మంజీరా జలాలతో స్వామివారికి శ్రీశ్రీశ్రీ శఠకోపముని రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం శ్రీ రంగనాయక స్వామి, ఆళ్వార్ ఆచార్యులకు తిరుమంజనం నిర్వహించారు. శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత చతుర్భుజ కృష్ణుడికి నవ కలశస్థాపన చేసి ప్రత్యేక తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామార్చన చేపట్టారు.

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక సేవలు

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారులతో ఉట్లోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకీ సేవ, దీపోత్సవం, ఊంజల్ సేవ, ఏకాంత సేవ వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడుతూ శ్రీకృష్ణుడి జీవితం, ఆయన బోధనలు మానవాళికి ఎంతో విలువైన సందేశాన్ని అందిస్తాయని తెలిపారు. ధర్మాన్ని కాపాడుతూ సమాజానికి మార్గనిర్దేశం చేసిన శ్రీకృష్ణుడి చరిత్రను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కళకళలాడింది. భజనలు, కీర్తనలు, శ్రీకృష్ణ నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ముచ్చింతల్ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి శిష్య బృందం, ఆలయ భజన మండలి సభ్యులు, ఆలయ అభివృద్ధి సమితి సభ్యులు, రంగంపేట గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language