మెదక్ జిల్లా సాంస్కృతిక సారథి అధ్యక్షుడిగా కొమ్ముల శేఖర్ గౌడ్
ఏడుపాయల్లో సమావేశం.. జిల్లా కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
కొల్చారం, సెప్టెంబర్ 15 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
తెలంగాణ సాంస్కృతిక సారథుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం కోసం ఐక్యంగా కృషి చేయాలని మెదక్ జిల్లా సాంస్కృతిక సారథి నూతన కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర తెలంగాణ సాంస్కృతిక సారథి పిలుపు, ఆదేశాల మేరకు మంగళవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలలో సాంస్కృతిక సారథుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక సారథులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి విధులు, సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
సాంస్కృతిక సారథుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
అనంతరం మెదక్ జిల్లా సాంస్కృతిక సారథి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా శివ్వొల్ల కృష్ణ, జిల్లా అధ్యక్షుడిగా కొమ్ముల శేఖర్ గౌడ్, కార్యదర్శిగా నేనావత్ మదన్ సింగ్, కోశాధికారిగా కారంగుల మాధవి, ఉపాధ్యక్షుడిగా ధరవత్ రాజులను ఎన్నుకున్నారు.
కొత్తగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సాంస్కృతిక సారథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని సాంస్కృతిక సారథులందరినీ సమన్వయం చేసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.
సాంస్కృతిక సారథులకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జిల్లా స్థాయిలో ఐక్యంగా పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.
జిల్లా కమిటీని ఎన్నుకోవడం పట్ల సాంస్కృతిక సారథులు హర్షం వ్యక్తం చేసి నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్లో జిల్లాలో సాంస్కృతిక సారథుల కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నూతన కమిటీ కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.
