తూప్రాన్లో అనధికార వెంచర్లపై కొరడా.. బౌండరీ రాళ్ల తొలగింపు
HMDA, LRS అనుమతులు లేకుండా ప్లాటింగ్ చేస్తే కఠిన చర్యలు
అనుమతి ఉన్న ప్లాట్ల యజమానులు బౌండరీ రాళ్లపై Approval నంబర్ నమోదు చేయాలి
తూప్రాన్, సెప్టెంబర్ 19 (తెలుగు ట్రెండ్స్):
తూప్రాన్ మున్సిపల్ పరిధిలో అనధికార వెంచర్లు, లేఅవుట్లపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. HMDA అనుమతి లేదా సంబంధిత LRS ఆమోదం లేకుండా ఏర్పాటు చేసిన అనధికార వెంచర్లు, లేఅవుట్లలో ప్లాట్ల హద్దులను సూచిస్తూ ఏర్పాటు చేసిన బౌండరీ రాళ్లను తొలగించే చర్యలను శుక్రవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టారు.
మున్సిపల్ పరిధిలో HMDA అనుమతి లేదా సంబంధిత LRS ఆమోదం లేకుండా ఎలాంటి అనధికార వెంచర్లు, లేఅవుట్లు ఏర్పాటు చేయరాదని అధికారులు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ప్లాట్ల హద్దులను సూచించే బౌండరీ రాళ్లు ఏర్పాటు చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.
ప్రతిరోజూ తనిఖీలు.. కొనసాగనున్న తొలగింపు చర్యలు
అనధికార వెంచర్లు, లేఅవుట్లపై చర్యలు ఇకపై కూడా నిరంతరంగా కొనసాగుతాయని మున్సిపల్ అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినట్లు గుర్తించిన బౌండరీ రాళ్లను తొలగించడంతో పాటు, వర్తించే చట్టాలు, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే ఇప్పటికే HMDA Layout Approval, LRS Approval లేదా ఇతర చెల్లుబాటు అయ్యే అనుమతులు పొందిన ప్లాట్లు, లేఅవుట్లకు సంబంధించిన బౌండరీ రాళ్లను తొలగించకుండా ఉండాలంటే సంబంధిత యజమానులు, డెవలపర్లు ప్రతి బౌండరీ రాయిపై Approval లేదా Proceedings Numberను స్పష్టంగా కనిపించేలా నమోదు చేయాలని సూచించారు.
Approval లేదా Proceedings Number నమోదు చేయని బౌండరీ రాళ్లను అనధికార ప్లాటింగ్కు సంబంధించినవిగా పరిగణించి, ముందస్తు సమాచారం లేకుండానే తొలగించే అవకాశం ఉంటుందని మున్సిపాలిటీ హెచ్చరించింది.
LRS దరఖాస్తుదారులకు కీలక సూచన
G.O.Ms.No.131 ప్రకారం LRS-2020 కింద దరఖాస్తు సమయంలో చెల్లించిన రూ.1,000 కేవలం దరఖాస్తు/రిజిస్ట్రేషన్ రుసుము మాత్రమేనని, దానిని LRS అనుమతిగా పరిగణించరాదని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.
కేవలం రూ.1,000 రసీదు ఉన్న దరఖాస్తుదారులు తమ సంబంధిత Registered Sale Deed లేదా Title Document సమర్పించి, ప్లాట్ లొకేషన్ Geo-Tagging ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని సూచించారు. అనంతరం Citizen Login ద్వారా Onlineలో Generate అయ్యే మిగిలిన LRS రుసుములను పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
అర్హత కలిగిన దరఖాస్తులను సంబంధిత నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరిస్తామని అధికారులు పేర్కొన్నారు.
నవంబర్ 30 వరకు 25 శాతం రాయితీ
ప్రస్తుతం LRS రుసుములపై 25 శాతం రాయితీ 30-11-2026 వరకు అమల్లో ఉన్నందున అర్హులైన దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపాలిటీ సూచించింది. నిర్ణీత గడువులోపు పూర్తి రుసుములు చెల్లించి తమ LRS దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరింది.
అనుమతులు లేని వెంచర్లు, లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అనుమతులు, పత్రాలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచించారు.
– కమిషనర్, తూప్రాన్ మున్సిపాలిటీ

