నాగుసానిపల్లి వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
పాపన్నపేట, సెప్టెంబర్ 4 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
పాపన్నపేట మండల పరిధిలోని నాగుసానిపల్లి గ్రామంలోని శ్రీ మురళీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి, స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయాన్నే ఆలయ అర్చకులు శ్యాంసుందర్ శర్మ, శ్రీనివాస్ జోష్, రామ్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక పూజల అనంతరం వేణుగోపాల స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు, చిన్నారులు, గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఊరేగింపు అనంతరం స్వామివారిని తిరిగి ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు. అక్కడ భక్తులు, యువతీ యువకులు, మహిళలు సంప్రదాయబద్ధంగా కోలాటాలు నిర్వహించి వేడుకలకు మరింత శోభను తీసుకువచ్చారు. భక్తి గీతాలు, కోలాటాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తుల విశ్వాసం, సహకారంతో వేడుకలను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏడుపాయల మాజీ చైర్మన్ పార్ష నర్సింలు, గుప్తా, ఇంద్రసేనారెడ్డి, యాబన్న, పల్లె సాయిబాబా, పార్ష మహేందర్ గుప్తా, గుంటుకు రాజయ్య, కర్చల శ్రీనివాస్, అంతు శ్రీనివాస్, దుర్గేష్, యాదగిరి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
