Type Here to Get Search Results !

గణేష్‌ ఉత్సవాలకు నిబంధనలే కవచం.. డీజేలకు నో: వెల్దుర్తి ఎస్‌ఐ

 



భక్తితో గణేష్ నవరాత్రి వేడుకలు.. నిబంధనలు తప్పనిసరి

డీజేలకు అనుమతి లేదు.. రాత్రి 10 తర్వాత స్పీకర్లు బంద్‌: వెల్దుర్తి ఎస్‌ఐ కర్ణాకర్‌రెడ్డి

వెల్దుర్తి మండలం, సెప్టెంబర్ 12 (తెలుగు ట్రెండ్స్):
గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఉత్సవాల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వెల్దుర్తి ఎస్‌ఐ కర్ణాకర్‌రెడ్డి హెచ్చరించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, మతసామరస్యాన్ని కాపాడుతూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో శనివారం గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై వివిధ గ్రామాల గణేష్‌ మండపాల నిర్వాహకులతో పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, భక్తుల భద్రత, శబ్ద కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్‌ తదితర అంశాలపై ఎస్‌ఐ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

మండపాల నమోదు, అనుమతి తప్పనిసరి

ప్రతి గణేష్‌ మండపం నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో మండపాన్ని నమోదు చేసుకుని పోలీసుల అనుమతి పొందాలని ఎస్‌ఐ సూచించారు. మండపాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద 24 గంటలూ కనీసం ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

డీజేలకు నో.. 10 గంటల తర్వాత స్పీకర్లు బంద్‌

ఉత్సవాల సందర్భంగా శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్‌ఐ కర్ణాకర్‌రెడ్డి అన్నారు. డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. మండపాల వద్ద రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలని ఆదేశించారు.

వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా శబ్ద కాలుష్యాన్ని నియంత్రించాలని సూచించారు. ఉత్సవాల పేరుతో నిబంధనలు ఉల్లంఘించి ఇతరులకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సోషల్‌ మీడియా పుకార్లను నమ్మొద్దు

గణేష్‌ ఉత్సవాల సందర్భంగా సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఎస్‌ఐ సూచించారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం కనిపించినా, సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సోషల్‌ మీడియా ద్వారా వదంతులను వ్యాప్తి చేసే వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా మండపాల నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడటం వంటి వాటిని ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

భక్తిశ్రద్ధలతో పాటు క్రమశిక్షణ, మతసామరస్యంతో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్‌ఐ కర్ణాకర్‌రెడ్డి మండపాల నిర్వాహకులకు సూచించారు.

ఈ సమావేశంలో వెల్దుర్తి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన గణేష్‌ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language