తాగునీటి కోసం తపిస్తున్న పోతంశెట్టిపల్లి ప్రజలు
నాలుగేళ్లుగా నీటి సమస్య.. వర్షంలోనూ జాతీయ రహదారిపై మహిళల ధర్నా
కొల్చారం, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా సమీపంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. సుమారు 50 ఇళ్లకు గత నాలుగేళ్లుగా తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు గ్రామ పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆదివారం మహిళలు ఆందోళనకు దిగారు.
నాలుగేళ్లుగా నీటి కోసం ఎదురుచూపులు
స్థానికుల వివరాల ప్రకారం.. చౌరస్తా ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సుమారు మూడేళ్ల క్రితం మెదక్–హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని దర్గా వెనుక భాగంలో నూతన రక్షిత మంచినీటి ట్యాంక్‌ను నిర్మించారు. అయితే ట్యాంకుకు అవసరమైన కనెక్షన్ ఇవ్వకపోవడంతో నిర్మాణం పూర్తయినా తమకు నీటి సమస్య తీరలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గత పది నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో తాను ఎన్నికైతే వారం రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని మహిళలు తెలిపారు. అయితే సమస్య పరిష్కారం కాకపోగా, వారం లేదా పది రోజులకు ఒకసారి ఫోన్ చేస్తే ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని చెప్పారు. దీంతో తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షంలో జాతీయ రహదారిపై నిరసన
సమస్యపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం లభించకపోవడంతో ఆగ్రహించిన మహిళలు గ్రామానికి రక్షిత మంచినీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను కోసివేసి, అనంతరం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మెదక్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు.
సంవత్సరాలుగా తమ తాగునీటి సమస్యను పరిష్కరించడంలో పంచాయతీ పాలకవర్గం విఫలమైందని మహిళలు ఆరోపించారు. తమ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యను ప్రశ్నించే యువకులపై కేసులు పెట్టిస్తున్నారని కూడా కొందరు మహిళలు ఆరోపించారు.
ఆందోళన విరమించిన మహిళలు
సమాచారం అందుకున్న కొల్చారం ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తాగునీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
సర్పంచ్ వివరణ
తాగునీటి సమస్యపై పోతంశెట్టిపల్లి సర్పంచ్ దయాకర్ గౌడ్‌ను చరవాణి ద్వారా వివరణ కోరగా, ఆయన నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదని స్థానికులు తెలిపారు.

