చాకలి ఐలమ్మ సేవలు చిరస్మరణీయం
రామాయంపేటలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం
రామాయంపేట, సెప్టెంబర్ 10 (తెలుగు ట్రెండ్స్):
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని రామాయంపేట మున్సిపల్ పరిధిలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన చాకలి ఐలమ్మ సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. అణచివేత, అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడి సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన తెగువ, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఐలమ్మ ఆశయాలను స్మరించుకోవడంతో పాటు సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు పుట్టి సందీప్, దాకి శ్యామల స్వామి, పట్టణ అధ్యక్షురాలు చింతల స్వప్న స్వామితో పాటు రజక సంఘం పెద్దలు, బీసీ సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ త్యాగాలను స్మరించుకుంటూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు.

