Type Here to Get Search Results !

చిట్కూల్‌ కేజీబీవీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.. విద్యార్థినులకు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అవగాహన

 


చిట్కూల్‌ కేజీబీవీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి.. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

చిలిపిచేడ్ మండలం, సెప్టెంబర్ 5: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం చిలిపిచేడ్ మండలంలోని చిట్కూల్ కేజీబీవీలో నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను ఎస్పీ శాలువాలతో సన్మానించి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను నేర్పుతూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. విద్యార్థులు సాధించే విజయాల వెనుక ఉపాధ్యాయుల కృషి, మార్గదర్శకత్వం ఉంటుందని అన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయురాలికి అభినందనలు

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన ఉమాదేవిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఆమె విద్యారంగానికి అందిస్తున్న సేవలను ప్రశంసించారు.

అలాగే కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఎం. అంజలిని కూడా ఎస్పీ అభినందించారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భోజన సదుపాయాలు అందిస్తూ, పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా కేజీబీవీలో ఉత్తమ సేవలు అందించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు.

బాలికలకు పోక్సో, సైబర్ నేరాలపై అవగాహన

అనంతరం ఎస్పీ విద్యార్థినులతో ముఖాముఖిగా మాట్లాడి పోక్సో చట్టం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. బాలికలు తమకు ఎదురయ్యే ఇబ్బందులను పోలీసు అక్క దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని విద్యార్థినులకు సూచించారు.

విద్యార్థినుల విద్యాభ్యాసం, భవిష్యత్తు లక్ష్యాల గురించి ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఎం. అంజలి, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, ఎంఈఓ, పాఠశాల అధ్యాపకులు, సీఐలు సందీప్‌రెడ్డి, రంగాకృష్ణ, ఎస్‌ఐ నర్సింలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ న్యూస్ | మెదక్ జిల్లా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language