ఆందోళన చేస్తేనే కదిలిన విద్యుత్ అధికారులు.. తెగిపడిన వైర్లపై గ్రామస్తుల ఆగ్రహం
సమాచారం ఇచ్చినా స్పందించని అధికారుల తీరుపై సర్పంచ్ శేఖర్ మండిపాటు
వెల్దుర్తి మండలం, సెప్టెంబర్ 14 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విద్యుత్ వైర్లు రోడ్డుపై తెగిపడి ఉన్నా సంబంధిత అధికారులు సకాలంలో స్పందించకపోవడంపై శెట్టిపల్లి కలాన్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ శేఖర్ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.
వెల్దుర్తి మండల పరిధిలోని శెట్టిపల్లి కలాన్ గ్రామంలో ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి 33/11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపోయి రోడ్డుపై పడిపోయాయి. ప్రమాదకర పరిస్థితిని గమనించిన గ్రామ సర్పంచ్ శేఖర్ వెంటనే వెల్దుర్తి విద్యుత్ ఏఈకి సమాచారం అందించినట్లు తెలిపారు. అయినప్పటికీ సకాలంలో అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.
విద్యుత్ వైర్లు రోడ్డుపై పడిపోవడంతో అటుగా రాకపోకలు సాగించే ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో వైర్లు కనిపించకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు సమాచారం ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపించారు.
దీంతో సర్పంచ్ శేఖర్ గ్రామస్తులతో కలిసి విద్యుత్ సబ్స్టేషన్కు వెళ్లి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని కోరారు. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శేఖర్ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న విషయం తెలిసినప్పటికీ విద్యుత్ అధికారులు స్పందించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమన్నారు. సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి ప్రమాదకరంగా పడిపోయిన వైర్లను తొలగించి ఉంటే గ్రామస్తులు సబ్స్టేషన్ వరకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు.
ప్రజల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. చిన్నపాటి జాప్యం కూడా ప్రాణనష్టానికి దారితీసే ప్రమాదం ఉందని, ఇలాంటి ఘటనల్లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిగణనలోకి తీసుకుని అత్యవసర సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు.
గ్రామస్తుల ఆందోళన విషయం తూప్రాన్ సబ్డివిజన్ డీఈ దశరథ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. విద్యుత్ సిబ్బందిని గ్రామానికి పంపించి రోడ్డుపై తెగిపడిన విద్యుత్ వైర్లకు మరమ్మతులు చేయించారు. దీంతో ప్రమాదం తప్పడంతో పాటు విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్య పరిష్కారమైంది. అనంతరం గ్రామస్తులు తమ ఆందోళనను విరమించారు.
ప్రజలు సమాచారం ఇచ్చినప్పుడు స్పందించకుండా ఆందోళనకు దిగిన తర్వాతే అధికారులు కదలడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఎలాంటి జాప్యం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విద్యుత్ శాఖ అధికారులను కోరారు. ప్రజల ప్రాణ భద్రతకు సంబంధించిన విద్యుత్ సమస్యలను అధికారులు అత్యవసరంగా పరిగణించి వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు స్పష్టం చేశారు.


