ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి
మండపాల నిర్వాహకులతో పోలీసుల సమన్వయ సమావేశం.. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
మెదక్, సెప్టెంబర్ 12 (తెలుగు ట్రెండ్స్):
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ సూచించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు.
గణేష్ ఉత్సవాల నిర్వహణపై శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మెదక్ టౌన్, మెదక్ రూరల్ సర్కిల్ పరిధిలోని ఐదు పోలీస్స్టేషన్లకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల ఏర్పాటు, భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శబ్ద కాలుష్యం, నిమజ్జనం తదితర అంశాలపై పోలీసు అధికారులు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
మండపాల నమోదు తప్పనిసరి
ప్రతి గణేష్ మండపాన్ని పోలీసు శాఖ వెబ్సైట్లో నమోదు చేసుకుని అనుమతి పొందాలని ఎస్పీ సూచించారు. విగ్రహం ఎత్తు, మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిమజ్జనం తేదీ, ప్రదేశం తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు.
మండపాల వద్ద 24 గంటలూ కనీసం ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
డీజేలకు అనుమతి లేదు
మండపాల వద్ద టపాకాయలు కాల్చరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు, ఇతర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శబ్ద కాలుష్యాన్ని నియంత్రించాలని అన్నారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలని, గణేష్ మండపాల వద్ద డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.
పోలీసులు సూచించిన నిబంధనలను ఉల్లంఘించి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
వదంతులను నమ్మొద్దు
సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు కోరారు. ఉత్సవాల సందర్భంగా ఏదైనా సమస్య తలెత్తినా, అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపడతామని చెప్పారు.
ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించి గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా, సోదరభావంతో నిర్వహించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, కృష్ణమూర్తి, సందీప్రెడ్డి, సీనియర్ సిటిజన్స్ సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

