విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా
జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు ఎనిమిది రకాల కిట్ల పంపిణీ
వెల్దుర్తి, సెప్టెంబర్ 22 (తెలుగు ట్రెండ్స్):
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందిస్తోంది. ఇందులో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎనిమిది రకాల కిట్లను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ దండే ఆదర్శ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మాధురి విద్యార్థులకు కిట్లను అందజేశారు.
కిట్లలో ఒక జత యూనిఫాం, ఐడీ కార్డు, స్కూల్ బ్యాగ్, బ్లాక్ షూస్, వైట్–బ్లాక్ సాక్సులు, బెల్ట్తో పాటు పాఠశాలకు అవసరమైన ఇతర సామగ్రి ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించడం ద్వారా వారు క్రమశిక్షణతో పాఠశాలకు హాజరై, సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రభుత్వం అందిస్తున్న కిట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
సర్పంచ్ దండే ఆదర్శ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై, ప్రభుత్వం అందించిన యూనిఫాం, షూస్, సాక్సులు తదితర సామగ్రిని విధిగా వినియోగించాలని సూచించారు. పాఠశాల స్థాయిలో అందుతున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని కోరారు.
ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఎం సుభాష్ గౌడ్, సీసీలు సుల్తానా, జయలక్ష్మి, సువాసిని, ఉపాధ్యాయులు నర్సింహారెడ్డి, కదీర్ పాషా, విజయమోహన్, రాజ్, అమూల్య, శైలజ, అర్చన, రాములు తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

