చిన్న ఘనాపూర్ సొసైటీలో అవకతవకల ఆరోపణలు
రూ.8.18 లక్షల వ్యవహారంపై మహాసభలో తీవ్ర చర్చ.. సీఈఓ, పాలకవర్గంపై చర్యలకు తీర్మానం
కొల్చారం, సెప్టెంబర్ 18 (తెలుగు ట్రెండ్స్):
కొల్చారం మండలంలోని చిన్న ఘనాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో రైతుల సమస్యలు, సొసైటీ నిర్వహణ తీరుపై శుక్రవారం జరిగిన మహాసభలో తీవ్ర చర్చ జరిగింది. సొసైటీ రికార్డుల నిర్వహణ, ఆడిట్, రుణమాఫీ, యూరియా సరఫరా తదితర అంశాలపై పలువురు సభ్యులు, రైతులు ప్రశ్నలు లేవనెత్తారు.
సొసైటీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, రికార్డుల నిర్వహణపై అనుమానాలు ఉన్నాయని పలువురు సభ్యులు ఆరోపించారు. ముఖ్యంగా రూ.8.18 లక్షల మేర నిధుల అవకతవకలు జరిగినట్లు మహాసభలో ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు.
సొసైటీ రికార్డులను సక్రమంగా ఆడిట్ చేయలేదని, రుణమాఫీ విషయంలో కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు రైతులు, సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ సీఈఓతో పాటు పాలకవర్గాన్ని తప్పించాలని మహాసభలో తీర్మానం చేసినట్లు వారు తెలిపారు.
సొసైటీ కార్యాలయంలో జరిగిన మహాసభకు గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ మంద నాగులు, బాగారెడ్డి, పెద్ద రైతు సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు మల్లేశం తదితరులు హాజరయ్యారు.
మాజీ సీఈఓ సంతకంపై ఫోర్జరీ ఆరోపణలు
మహాసభలో సొసైటీ సీఈఓ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. గతంలో పాలకవర్గ సభ్యులు మాజీ సీఈఓ కృష్ణ సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఈ అంశంపై కూడా సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని పలువురు కోరారు.
యూరియా సరఫరాపై రైతుల ఆగ్రహం
వానాకాలం సాగు సీజన్లో యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్న సమయంలో సొసైటీ పాలకవర్గం రైతుల సమస్యలపై తగినంతగా స్పందించడం లేదని చిన్న ఘనాపూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలంలోని ప్రధాన వరి సాగు ప్రాంతాల్లో ఒకటైన చిన్న ఘనాపూర్ సొసైటీ ద్వారా రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు పాలకవర్గం చొరవ చూపాలని రైతులు కోరారు. సొసైటీ నిర్వహణపై వచ్చిన ఆరోపణలను అధికారులు సమగ్రంగా పరిశీలించి, వాస్తవాలను రైతుల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
సొసైటీ వ్యవహారాల్లో పారదర్శకత పెంచి రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందని పలువురు రైతులు పేర్కొన్నారు.

