మెదక్ మహాదేవాలయం నిర్మాత రెవ. చార్ల్స్ వాకర్ పోస్నెట్ 76వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక ఆరాధన
మెదక్, సెప్టెంబర్ 30 (తెలుగు ట్రెండ్స్): మెదక్ మహాదేవాలయం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన రెవ. చార్ల్స్ వాకర్ పోస్నెట్ 76వ వర్ధంతిని పురస్కరించుకుని మెదక్ చర్చిలో ప్రత్యేక ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చార్ల్స్ వాకర్ పోస్నెట్ సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మెదక్ చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జి డా. టి. శాంతయ్య మాట్లాడుతూ ఎంతో దూరం నుంచి మెదక్ ప్రాంతానికి వచ్చిన రెవ. చార్ల్స్ వాకర్ పోస్నెట్ ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతికి విశేష సేవలు అందించారని కొనియాడారు. విద్య, వైద్య రంగాల్లో సేవలందించేందుకు పాఠశాలను, అనంతరం ఆసుపత్రిని ఏర్పాటు చేయడంతో పాటు మెదక్లో ఎంతో గొప్ప చర్చి నిర్మాణానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. చార్ల్స్ వాకర్ పోస్నెట్ చిన్ననాటి నుంచే దేవుని పట్ల భయభక్తులతో జీవించారని, మంచి మార్గంలో నడుస్తూ తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని డా. శాంతయ్య తెలిపారు. ఆయన అందించిన సేవలు నేటికీ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని అన్నారు. సమాజానికి విద్య, వైద్యం, ఆధ్యాత్మిక సేవలను అందించడంలో ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఆయన సేవా స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మీయ సేవలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గురువులు డేవిడ్ రీచార్డ్స్, జైపాల్, శ్రీనివాస్, స్థానిక చర్చి సెక్రటరీ బి. గెలన్ చిత్తరంజన్, ట్రెజరర్ గంట సంపత్, పాస్టరెట్ స్టూవార్డు ప్రభుదయ, చర్చి స్టూవార్డు దేవా ప్రకాష్, సీనియర్ సభ్యుడు బోడి సుబ్రహ్మణ్యం, ప్రాపర్టీ సెక్రటరీ సుశీల్, కమిటీ సభ్యులు జాయ్ మూర్రే, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

