వరికోత మిషన్ పేరుతో రైతుకు టోకరా..!
రూ.30 వేల సైబర్ మోసం.. ఫిర్యాదుతో రూ.21 వేలు రికవరీ
ఒక్క ఫోన్ కాల్‌తో మోసం.. వెంటనే 1930కు ఫిర్యాదుతో స్పందించిన సైబర్ పోలీసులు
వెల్దుర్తి, సెప్టెంబర్ 2 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
వరికోత మిషన్ అందిస్తానంటూ నమ్మించి ఓ రైతు నుంచి రూ.30 వేలు కాజేసిన సైబర్ మోసగాళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే బాధితుడు వెంటనే స్పందించి 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో సైబర్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రూ.21 వేల నగదును రికవరీ చేసి బాధితుడి ఖాతాలో తిరిగి జమ చేశారు. ఈ విషయాన్ని వెల్దుర్తి ఎస్సై బి. కర్ణాకర్‌రెడ్డి బుధవారం వెల్లడించారు.
వరికోత మిషన్ పేరుతో వల
ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పుల్లబోయిన భూపాల్‌కు ఏప్రిల్ 15న ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు సుధాకర్‌గా పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి.. తన వద్ద వరికోత మిషన్ ఉందని, అవసరమైతే పంపిస్తానని నమ్మించాడు.
వరికోత మిషన్ కోసం డీజిల్ ఖర్చుల నిమిత్తం ముందస్తుగా రూ.30 వేలు పంపించాలని కోరడంతో భూపాల్ అతడి మాటలు నమ్మాడు. దీంతో ఫోన్‌పే ద్వారా రెండు విడతల్లో రూ.20 వేలు, మరో స్కానర్ ద్వారా రూ.10 వేలు పంపించాడు.
డబ్బులు పంపిన వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్
డబ్బులు పంపిన అనంతరం సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో భూపాల్ తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించాడు. ఆలస్యం చేయకుండా అదే రోజు 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లోనూ ఫిర్యాదు నమోదు చేశాడు.
ఫిర్యాదుపై స్పందించిన సైబర్ పోలీసులు నగదు లావాదేవీలను ట్రాక్ చేశారు. ఈ క్రమంలో రూ.21 వేల నగదును సీజ్ చేయగా.. బుధవారం బాధితుడు పుల్లబోయిన భూపాల్ ఖాతాలో ఆ మొత్తాన్ని తిరిగి జమ చేసినట్లు ఎస్సై కర్ణాకర్‌రెడ్డి తెలిపారు.
మిగిలిన నగదు, ఈ మోసానికి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై పేర్కొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కర్ణాకర్‌రెడ్డి సూచించారు. అలాగే NCRP పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని కోరారు.
డబ్బులు పంపిన లావాదేవీలకు సంబంధించిన UTR నంబర్లు, స్క్రీన్‌షాట్లు, ఫోన్ నంబర్లు, ఇతర ఆధారాలను భద్రపరచుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ముందస్తుగా డబ్బులు పంపాలని కోరితే ఆచితూచి వ్యవహరించాలని, నిర్ధారణ లేకుండా ఎలాంటి లావాదేవీలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
– తెలుగు ట్రెండ్స్ న్యూస్
వెల్దుర్తి
