చేయూత పింఛన్లకు క్షేత్రస్థాయి వెరిఫికేషన్
వివిధ కేటగిరీల దరఖాస్తులపై అధికారుల ఆరా.. ఈ నెల 25లోపు ప్రక్రియ పూర్తి
వెల్దుర్తి, సెప్టెంబర్ 22 (తెలుగు ట్రెండ్స్):
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొత్త చేయూత పింఛన్ల ప్రక్రియలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం పింఛన్ల దరఖాస్తుల క్షేత్రస్థాయి వెరిఫికేషన్ను అధికారులు చేపట్టారు. వివిధ కేటగిరీలకు చెందిన దరఖాస్తులను పరిశీలిస్తూ లబ్ధిదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది.
వితంతు పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు తదితర కేటగిరీలకు సంబంధించి లబ్ధిదారులు సమర్పించిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దరఖాస్తుల్లో పొందుపరిచిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తున్నట్లు వెరిఫికేషన్ అధికారి సందీప్ రెడ్డి తెలిపారు.
దరఖాస్తుదారుల వివరాలు, అర్హతలను పరిశీలించిన అనంతరం వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 25లోపు దరఖాస్తుల వెరిఫికేషన్ను పూర్తిచేసి, సంబంధిత అధికారులకు సమగ్ర నివేదిక అందజేస్తామని సందీప్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెల్దుర్తి పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
