Type Here to Get Search Results !

20 ఏళ్లుగా సాగులో ఉన్నా.. పట్టా పాస్‌బుక్కులు లేవు! 209 సర్వే నంబర్‌ రైతులకు న్యాయం చేయాలి సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా

 


20 ఏళ్లుగా కాస్తులో ఉన్న రైతులకు పట్టా పాస్‌బుక్కులు ఇవ్వాలి

209 సర్వే నంబర్‌ రైతులకు న్యాయం చేయాలి

సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా

కొల్చారం, ఆగస్టు 31 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
కొల్చారం మండలం కొంగోడు గ్రామంలోని 209 సర్వే నంబర్‌ భూముల్లో గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు వెంటనే పట్టా పాస్‌బుక్కులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాస్తులో ఉన్న రైతులకు భూమిపై హక్కులు కల్పించి, పట్టా పాస్‌బుక్కులు అందించాలని నినదించారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ మాట్లాడుతూ.. కొంగోడు గ్రామానికి చెందిన సుమారు 86 కుటుంబాలు 2006 సంవత్సరం నుంచి 209 సర్వే నంబర్‌లోని భూములను సాగు చేసుకుంటూ కాస్తులో ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం వారికి భూమికి సంబంధించిన పట్టా పాస్‌బుక్కులు ఇవ్వలేదని అన్నారు.

పట్టా పాస్‌బుక్కులు లేకపోవడంతో రైతులు ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా రైతుబంధు వంటి వ్యవసాయ ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

తమ భూములకు పట్టా పాస్‌బుక్కులు మంజూరు చేయాలని రైతులు గతంలో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని నర్సమ్మ అన్నారు. రెండు దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్న రైతుల సమస్యను ప్రభుత్వం ఇంకా పరిష్కరించకపోవడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల సమస్యపై ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి 209 సర్వే నంబర్‌లో కాస్తులో ఉన్న అర్హులైన రైతుల భూములను పరిశీలించి పట్టా పాస్‌బుక్కులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాస్తుదారులు దాసు, విజయ, జయమ్మ, పోచయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

– తెలుగు ట్రెండ్స్ న్యూస్
కొల్చారం రిపోర్టర్‌: ముత్తయ్య

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language