రూ.18 కోట్ల నిధులు ఎటు వెళ్లాయి?
పాదయాత్ర కాదు.. నిధుల లెక్క చెప్పాలి!
వెల్దుర్తి–మెదక్ రహదారి దుస్థితిపై తెలంగాణ రక్షణ సేన ఇన్‌చార్జి అపర్ణ ఘాటు విమర్శలు
వెల్దుర్తి మండలం, ఆగస్టు 30 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
వెల్దుర్తి నుంచి మెదక్ వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి చలంగారి దండే అపర్ణ ఆరోపించారు. రహదారి దుస్థితి కారణంగా పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టం జరిగినా పాలకుల్లో కనీస స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు.
ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్దుర్తి–మెదక్ రహదారి నిర్మాణం, విస్తరణ కోసం రూ.18 కోట్లు మంజూరు చేయించామని చెప్పారని అపర్ణ గుర్తుచేశారు. నిధులు మంజూరైన వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చి, ఆ తర్వాత ఆ హామీలను విస్మరించారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్న సమయంలో వెల్దుర్తి–మెదక్ రహదారి సమస్య ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి ఎందుకు గుర్తుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు రాజకీయంగా ప్రజల్లో ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ పేరుతో పాదయాత్ర చేపట్టి ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
వెల్దుర్తి, ఉప్పులింగాపురం, రామాయిపల్లి, బండపోసాన్‌పల్లి, షెట్టిపల్లి, కలాన్ తదితర ప్రాంతాల ప్రజల సమస్యలను విస్మరించి, రహదారి కోసం మంజూరైన రూ.18 కోట్ల నిధులు ఎటు వెళ్లాయో ప్రజలకు సమాధానం చెప్పాలని అపర్ణ డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, తన సొంత మండలమైన శివంపేట మండలానికి ఆ రూ.18 కోట్ల నిధులతో రోడ్డు వేయించుకుని వెల్దుర్తి మండలాన్ని విస్మరించారని ఆమె ఆరోపించారు. వెల్దుర్తి మండల ప్రజల కోసం మంజూరైన నిధులను తమ సొంత మండల అభివృద్ధికి వినియోగించి ఉంటే, అది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇన్నాళ్లూ వెల్దుర్తి మండల ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరుతో పాదయాత్రలు చేపడుతూ సవతి తల్లి ప్రేమ చూపించడం రాజకీయ లబ్ధి కోసమేనని అపర్ణ మండిపడ్డారు. ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు వాస్తవాలను మరిచిపోయే పరిస్థితి లేదని, గతంలో ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యే ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వెల్దుర్తి–మెదక్ రహదారి కోసం మంజూరైన రూ.18 కోట్ల నిధుల పరిస్థితిపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని అపర్ణ కోరారు.
– తెలుగు ట్రెండ్స్ న్యూస్
రిపోర్టర్: నర్సింహా గౌడ్

