కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల మహాధర్నా
డిమాండ్ల సాధన వరకు పోరాటం కొనసాగిస్తాం: జేఏసీ చైర్మన్ దొంత నరేందర్
మెదక్, ఆగస్టు 28 (తెలుగు ట్రెండ్స్): ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) మెదక్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయడం, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించడం, హెల్త్ కార్డులను సమర్థవంతంగా అమలు చేయడం, పెండింగ్ బిల్లులను చెల్లించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా జీవో-25ను సవరించాలని, జీవో-190ను అమలు చేయాలని కోరారు. ఇవి ఉద్యోగుల న్యాయమైన హక్కులని, వాటి సాధన కోసం ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 1న నిర్వహించనున్న పెన్షన్ విద్రోహ దినం, సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న చలో హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
మహాధర్నాలో ఉద్యోగులు “ఆవాజ్ దో.. హమ్ ఏక్ హై”, “వీ వాంట్ పీఆర్సీ”, “సీపీఎస్ అంతం.. జేఏసీ పంతం” అంటూ నినాదాలు చేశారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం నినాదాలతో మార్మోగింది.
అనంతరం జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడి ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యోగుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో యూనిస్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ మహాధర్నాలో టీఎన్జీవో, టీజీవో, పీఆర్‌టీయూ టీఎస్, ఎస్‌టీయూ, యూటీఎఫ్, టీఆర్‌టీఎఫ్, టీపీటీఎఫ్, టీటీయూ, క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
జేఏసీ ప్రతినిధులు రాజ్‌కుమార్, విట్టల్, రాజగోపాల్‌గౌడ్, పద్మారావు, ప్రణీత్‌కుమార్, యాదగిరి, జగదీష్‌చంద్ర, శ్యాంసుందర్, కొండల్‌రెడ్డి, నాగభూషణం, సౌమ్యనాయక్, శివయ్య, ఇక్బాల్ పాషా, చంద్రశేఖర్, పజాలుద్దీన్, రిజ్వాన్ అలీ, హర్షద్, లీల, శివాజీ, కిరణ్‌కుమార్, రాధా, విష్ణువర్ధన్‌రెడ్డి, గోపాల్, శేషాచారి, ప్రభాకర్, సంతోష్, ధర్మాచందర్, ప్రశాంత్, నిఖిల్ శ్రీనివాస్, విజయ్, నరేందర్‌గౌడ్, రాకేష్, శ్రీహరి, నర్సింగరావు, సంగయ్య, శ్రీనివాస్, కవిత, భూపాల్‌రెడ్డి, పి.డి. ఆనందం, సత్యనారాయణ, సురేందర్‌ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
