ఉద్యోగుల హక్కుల సాధన సమరభేరిని విజయవంతం చేయండి
10న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సభ
ఉద్యోగులు కుటుంబాలతో కలిసి భారీగా తరలిరావాలి: టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్
మెదక్, సెప్టెంబర్ 3 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉద్యోగుల హక్కుల సాధన సమరభేరిని విజయవంతం చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. గురువారం మెదక్‌లోని టీఎన్జీవో భవన్‌లో జిల్లాలోని వివిధ యూనిట్లు, డిపార్ట్‌మెంట్ ఫోరంల అధ్యక్ష, కార్యదర్శులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దొంత నరేందర్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న సమరభేరికి జిల్లాలోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తాలూకా యూనిట్లు, శాఖల వారీగా ఉద్యోగులు వాహనాలను ఏర్పాటు చేసుకుని హైదరాబాద్‌కు తరలిరావాలని సూచించారు.
యూనిట్ల వారీగా వాహనాల ఏర్పాటు
నర్సాపూర్, తూప్రాన్, చేగుంట, రామాయంపేట, అల్లాదుర్గ్ యూనిట్ల పరిధిలో శాఖల వారీగా వాహనాలను ఏర్పాటు చేసుకుని ఉద్యోగులు సమరభేరికి తరలిరావాలని తెలిపారు. మెదక్, ఏడుపాయల వనదుర్గ, పాపన్నపేట యూనిట్లకు చెందిన ఉద్యోగులు మెదక్ టీఎన్జీవో భవన్ నుంచి వాహన శ్రేణిగా బయలుదేరనున్నట్లు వెల్లడించారు.
ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమరభేరికి హాజరై ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని దొంత నరేందర్ కోరారు. జిల్లాలోని అన్ని యూనిట్లు, శాఖల బాధ్యులు సమన్వయంతో పనిచేసి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సన్నాహక సమావేశంలో..
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అనురాధ, జిల్లా సహాధ్యక్షులు ఇక్బాల్ పాషా, ఉపాధ్యక్షులు ఫజలుద్దీన్, రఘునాథరావు, సంయుక్త కార్యదర్శి శివాజీ, మెదక్, నర్సాపూర్ యూనిట్ల అధ్యక్షులు రామాగౌడ్, శేషాచారి, ఏడుపాయల వనదుర్గ యూనిట్ కార్యదర్శి ప్రశాంత్‌తో పాటు వివిధ యూనిట్లు, డిపార్ట్‌మెంట్ ఫోరంల బాధ్యులు పాల్గొన్నారు.
