Type Here to Get Search Results !

జోగిపేటలో జోగినాథుని వైభవం..! భక్తిశ్రద్ధలతో ఘనంగా పల్లకి సేవ ఓం నమఃశివాయ నామస్మరణలతో మార్మోగిన జోగిపేట వీధులు

 



జోగిపేటలో వైభవంగా జోగినాథుని పల్లకి సేవ

ఓం నమఃశివాయ నామస్మరణలతో మార్మోగిన పట్టణ వీధులు

భక్తిశ్రద్ధలతో పల్లకి సేవలో పాల్గొన్న భక్తులు

జోగిపేట, (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో వెలసిన శ్రీ జోగినాథ స్వామి దేవాలయంలో జోగినాథుని పల్లకి సేవ కార్యక్రమాన్ని రెడీమేడ్ వస్త్ర వ్యాపార సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన శ్రీ జోగినాథ స్వామి ఆలయం పల్లకి సేవ సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది.

స్వామివారి పల్లకిని ప్రత్యేకంగా అలంకరించి పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా భక్తుల మధ్య ఊరేగించారు. క్లాక్ టవర్‌ నుంచి ప్రారంభమైన పల్లకి సేవ తూర్పుగౌని, శ్రీ పోచమ్మ దేవాలయం మీదుగా కొనసాగి చివరకు శ్రీ జోగినాథ స్వామి ఆలయానికి చేరుకుంది. పల్లకి సేవ సాగిన మార్గంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

పల్లకి సేవ సందర్భంగా భక్తులు “ఓం నమఃశివాయ” అంటూ శివనామస్మరణ చేయడంతో జోగిపేట పట్టణ వీధులు ఆధ్యాత్మిక నినాదాలతో మార్మోగాయి. పలువురు భక్తులు స్వామివారి పల్లకికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు తమ కుటుంబాలపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.

ఊరేగింపు సందర్భంగా పల్లకి సేవను దర్శించుకునేందుకు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు సైతం భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో జోగిపేటలో పండుగ వాతావరణం నెలకొంది.

భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ

పల్లకి సేవలో పాల్గొన్న భక్తులకు రెడీమేడ్ వస్త్ర వ్యాపార సంఘం సభ్యులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమ నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

శివనామస్మరణతో సాగిన పల్లకి సేవ భక్తులను ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంది. స్వామివారి పల్లకి ఆలయానికి చేరుకున్న అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు.

ప్రతి సంవత్సరం జోగినాథ స్వామి ఆలయంలో నిర్వహించే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఐక్యంగా పాల్గొని పల్లకి సేవను విజయవంతం చేయడం పట్ల రెడీమేడ్ వస్త్ర వ్యాపార సంఘం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

శ్రీ జోగినాథ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. పల్లకి సేవ ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో ముగిసింది.

– తెలుగు ట్రెండ్స్ న్యూస్

అందోలు ప్రతినిధి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language