Type Here to Get Search Results !

🔥 కాంగ్రెస్‌ 420 హామీలకు బీఆర్‌ఎస్‌ ‘బాకీ కార్డు’..! వెయ్యి రోజులు గడిచినా హామీల అమలేది? మెదక్‌లో 420 అడుగుల ఫ్లెక్సీతో భారీ నిరసన ఆరు గ్యారంటీలు.. 420 హామీలు ఏమయ్యాయి? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు

 



కాంగ్రెస్‌ 420 హామీలకు ‘బాకీ కార్డు’..!

వెయ్యి రోజులు గడిచినా హామీల అమలేది?

మెదక్‌లో 420 అడుగుల ఫ్లెక్సీతో బీఆర్‌ఎస్‌ భారీ నిరసన.. ప్రజలకు ‘బాకీ కార్డుల’ పంపిణీ

మెదక్‌, సెప్టెంబర్‌ 2 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మెదక్‌ పట్టణంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పార్టీ శ్రేణులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి రాందాస్‌ చౌరస్తా వరకు కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ 420 అడుగుల పొడవైన ఫ్లెక్సీతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం హెడ్‌ పోస్టాఫీసు వద్ద ధర్నా చేపట్టారు.

ప్రజలకు ‘బాకీ కార్డుల’ పంపిణీ

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలుపై వివరాలతో రూపొందించిన ‘బాకీ కార్డులను’ బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలకు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఏయే హామీలు ఇచ్చింది.. వాటిలో ఎన్ని అమలు చేసింది.. ఇంకా ఎన్ని హామీలు బకాయిలో ఉన్నాయనే విషయాలను ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు, దాదాపు వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఆరు గ్యారంటీలు, 420 హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ పడిందో వివరించేందుకే ‘బాకీ కార్డులు’ పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని చెప్పి ఆ హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపణ

రైతులకు రైతుబంధు, రైతుబీమా సక్రమంగా అందడం లేదని పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. యూరియా కోసం ఆన్‌లైన్‌ విధానాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కళ్లల్లో కన్నీళ్లు కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

“మాటలు కోటలు దాటుతున్నాయి.. కాళ్లు మాత్రం కదలడం లేదు” అన్న చందంగా సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగుతోందని ఆమె విమర్శించారు. మాటలతో కాలయాపన చేయకుండా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆమె కోరారు. ప్రజలు మళ్లీ కేసీఆర్‌ నాయకత్వం వైపు చూస్తున్నారని, రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

రైతులను కాంగ్రెస్‌ మోసం చేసింది: శేరి సుభాష్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ సక్రమంగా జరగలేదని, రైతుబంధు, రైతుబీమా విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

అన్ని వర్గాల ప్రజలు మళ్లీ కేసీఆర్‌ వైపు చూస్తున్నారని, రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు. ప్రజల సమస్యలపై బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.

‘బాకీ కార్డు’తో ప్రజలకు వివరిస్తున్నాం: తిరుపతిరెడ్డి

బీఆర్‌ఎస్‌ నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ప్రజలకు చెప్పుకోదగ్గ మేలు జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా బాకీ పడిందో వివరాలను ‘బాకీ కార్డు’ రూపంలో ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు.

అమలు చేయని హామీలను నెరవేర్చేలా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, అవసరమైతే ప్రజల సంక్షేమం కోసం మరింత పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు. రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, త్వరలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మెదక్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌, బట్టి జగపతి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్‌, కౌన్సిలర్‌ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు జుబేర్‌ అహ్మద్‌, దీపక్‌, కుమార్‌, సోహెల్‌, హవేలిఘనపూర్‌, శంకరంపేట-ఆర్‌ మండల పార్టీ అధ్యక్షులు సీహెచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, పట్లోరి రాజు, రామాయంపేట మాజీ ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గంగా నరేందర్‌, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

– తెలుగు ట్రెండ్స్ న్యూస్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language