SGTU సమస్యల పరిష్కారానికి వినతి
జీవో 25ను రద్దు చేయాలని డిమాండ్.. ప్రాథమిక పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి
మనోహరాబాద్, తెలుగు ట్రెండ్స్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు జీవో 25ను రద్దు చేయాలని కోరుతూ మెదక్ జిల్లా SGTU శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తూప్రాన్‌లో వినతిపత్రాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తూప్రాన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌ను కలిసి జీవో 25 వల్ల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో నెలకొన్న వివిధ సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా SGTU నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా జీవో 25కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమైతే పాఠశాలల్లో విద్యాబోధన మరింత సజావుగా కొనసాగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తమ సమస్యలను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని SGTU నాయకులు తెలిపారు. కార్యక్రమంలో SGTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం, మెదక్ జిల్లా అధ్యక్షుడు జింక అశోక్, జిల్లా బాధ్యులు సత్యం, రమేష్, యాదగిరి, పిలం, శ్రీధర్, వెంకటేష్, రాజు, రాములు, వెంకట రమణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
